మీ ఫోన్ పోయిందా? మీ ఆధార్ మీద ఫేక్ సిమ్స్ ఉన్నాయా? – సంచార్ సాథి పోర్టల్‌తో పూర్తిస్థాయి రక్షణ
మన దైనందిన జీవితంలో స్మార్ట్ ఫోన్ లేకుండా ఒక్కరోజు కూడా గడవని పరిస్థితి వచ్చింది. బ్యాంకింగ్ సేవలు, సోషల్ మీడియా, వ్యక్తిగత ఫోటోలు, ఆధార్, పాన్ వివరాలు అన్నీ మొబైల్‌లోనే ఉంటాయి. అలాంటి ఫోన్ పొరపాటున పోయినా లేదా దొంగిలించబడినా మనకు కలిగే బాధ మాటల్లో చెప్పలేనిది. ఫోన్ విలువ కంటే ఎక్కువ భయం మన వ్యక్తిగత డేటా ఎవరైనా దుర్వినియోగం చేయకుండా ఉందో లేదో అన్నదే.
ఇంకో పెద్ద సమస్య ఏంటంటే మనకు తెలియకుండానే మన ఆధార్ కార్డు మీద వేరే వ్యక్తులు సిమ్‌లు తీసుకుని మోసాలకు పాల్పడటం. అలాంటి నేరాలు జరిగితే అనుకోకుండా మన పేరు ఇరుక్కోవచ్చన్నది వాస్తవం.
ఈ అన్నీ సమస్యలకు పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది సంచార్ సాథి పోర్టల్‌ను. ఇది డిజిటల్ భద్రతకు ఒక పెద్ద రక్షణ కవచంలా నిలుస్తోంది.
సంచార్ సాథి అంటే ఏమిటి
సంచార్ సాథి అనేది టెలికాం శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఆన్‌లైన్ పోర్టల్. దీనివల్ల పోయిన లేదా దొంగిలించబడిన ఫోన్‌ను బ్లాక్ చేయవచ్చు, ఆధార్ మీద ఉన్న సిమ్‌ల వివరాలు తెలుసుకోవచ్చు, నకిలీ సిమ్‌లను రిపోర్ట్ చేయవచ్చు, ఫ్రాడ్ కాల్స్ మరియు మెసేజ్‌లపై ఫిర్యాదు చేయవచ్చు, అలాగే సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనేముందు ఆ ఫోన్ సురక్షితమా కాదా అనేది చెక్ చేయవచ్చు.
ఫోన్ పోయిన వెంటనే చేయాల్సిన పనులు
ఫోన్ మిస్సయిన వెంటనే మొదట దగ్గరలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వాలి లేదా ఆన్‌లైన్‌లో ఈఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి. తరువాత మీ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ వద్ద అదే నెంబర్‌తో డూప్లికేట్ సిమ్ తీసుకోవాలి.
సంచార్ సాథి వెబ్‌సైట్‌లో ఫోన్ బ్లాక్ చేసే విధానం
బ్రౌజర్‌లో sancharsaathi.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. అక్కడ Block Your Lost or Stolen Mobile అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. మీ మొబైల్ నెంబర్, ఐఎంఈఐ నెంబర్, ఫోన్ బ్రాండ్ వివరాలు నమోదు చేయాలి. పోలీసులు ఇచ్చిన కంప్లైంట్ కాపీని అప్లోడ్ చేసి కొత్త డూప్లికేట్ సిమ్ నెంబర్ ఇవ్వాలి. ఆ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది.
24 గంటలలో మీ ఫోన్ పూర్తిగా బ్లాక్ అవుతుంది. దొంగలు కొత్త సిమ్ వేసినా కూడా ఫోన్ పనిచేయదు. ఎవరైనా ఆ ఫోన్ ఆన్ చేస్తే వెంటనే లొకేషన్ పోలీసులకు తెలియజేస్తుంది.
ఆధార్ మీద మీ పేరుతో ఎన్ని సిమ్‌లు ఉన్నాయో తెలుసుకోవడం ఎలా
సంచార్ సాథి పోర్టల్‌లో Know Your Mobile Connections అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఓటీపీ వచ్చిన తరువాత లాగిన్ అవ్వాలి.
మీ ఆధార్‌కు లింక్ అయిన అన్ని యాక్టివ్ సిమ్‌ల లిస్ట్ అక్కడ కనిపిస్తుంది. మీకు తెలియని నెంబర్ కనిపిస్తే దాని పక్కన ఉన్న Not My Number అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి రిపోర్ట్ చేయాలి. వెంటనే ప్రభుత్వం ఆ నకిలీ సిమ్‌ను డిస్కనెక్ట్ చేస్తుంది.
ఫ్రాడ్ కాల్స్, మెసేజెస్‌ను రిపోర్ట్ చేయడానికి చక్షు ఫీచర్
లాటరీ వచ్చిందని, కరెంట్ బిల్ కట్టలేదని లేదా అకౌంట్ బ్లాక్ అవుతుందని చెప్పే ఫోన్ కాల్స్, మెసేజ్‌లు ఇప్పుడు ఎక్కువయ్యాయి. ఇవన్నీ సైబర్ మోసాలే. ఇలాంటి వాటిని సంచార్ సాథి పోర్టల్‌లో ఉన్న చక్షు ఫీచర్ ద్వారా నేరుగా రిపోర్ట్ చేయవచ్చు.
సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనేటప్పుడు అవసరమైన చెక్
మీరు సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే Know Your Mobile ఆప్షన్‌లోకి వెళ్లి ఆ ఫోన్ ఐఎంఈఐ నెంబర్ నమోదు చేయాలి. ఆ ఫోన్ దొంగిలించబడిందా లేదో లేదా బ్లాక్ లిస్టులో ఉందా అన్నది వెంటనే తెలుస్తుంది. బ్లాక్ లిస్ట్‌గా కనబడితే ఆ ఫోన్ కొనకూడదు.
మన భద్రత మన చేతుల్లోనే
ఫోన్ పోయిందని భయపడాల్సిన పనిలేదు. సంచార్ సాథి ద్వారా ఫోన్‌ను పూర్తిగా బ్లాక్ చేయవచ్చు. అలాగే ఆధార్ మీద ఉన్న ఫేక్ సిమ్‌లను తొలగించి మనల్ని మనమే సైబర్ నేరాల నుండి సురక్షితంగా ఉంచుకోవచ్చు.
ఈ సమాచారం అందరికీ చేరాలి
ఈ ఉపయోగకరమైన సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చేయండి. డిజిటల్ ఇండియాలో సురక్షితంగా ఉండాలంటే సంచార్ సాథి వాడటం ప్రతి ఒక్కరి బాధ్యత.
.jpg)
