కొత్త రేషన్ కార్డు పొందిన వారికి అర్హమైన ప్రభుత్వ పథకాలు


కొత్త రేషన్ కార్డు పొందిన వారికి అర్హమైన ప్రభుత్వ పథకాలు – పూర్తి వివరాలు (తెలంగాణ)

తెలంగాణలో దాదాపు పదేళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీ పూర్తిస్థాయిలో ప్రారంభమైంది. ఇప్పటికే లక్షలాది కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు అప్రూవ్ కావడం జరిగింది. రేషన్ కార్డు అనేది కేవలం బియ్యం తీసుకోవడానికి మాత్రమే కాదు, ప్రభుత్వ పథకాలలో అర్హత నిర్ధారించే ముఖ్యమైన ఆధారంగా కూడా ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో కొత్తగా రేషన్ కార్డు పొందిన వారు ఏ ఏ ప్రభుత్వ పథకాలకు అర్హులు, వాటికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే విషయాలను ఈ ఆర్టికల్‌లో స్పష్టంగా తెలుసుకుందాం.


ముందుగా తప్పనిసరిగా చేయాల్సింది – రేషన్ కార్డు eKYC

కొత్త రేషన్ కార్డు పొందిన ప్రతి ఒక్కరూ ముందుగా తమ సమీప రేషన్ షాప్‌లో eKYC పూర్తి చేయాలి.
eKYC చేసి రేషన్ సరుకులు తీసుకున్న తర్వాత ఒక కీ రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఈ నెంబర్ ఆధారంగానే మీరు ఏ ప్రభుత్వ పథకాలకు అర్హులో నిర్ణయించబడుతుంది.
కాబట్టి eKYC చేయించుకోకుండా ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తు చేయడం ఉపయోగం ఉండదు.


కొత్త రేషన్ కార్డు ఉన్నవారికి అర్హమైన ముఖ్యమైన పథకాలు

రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం

ఈ పథకం ద్వారా పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ₹5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందిస్తారు.
ప్రభుత్వం ఇచ్చిన తాజా ప్రకటన ప్రకారం, ఈ పథకం రేషన్ కార్డుతో సంబంధం లేకుండా అందరికీ వర్తింపజేయాలని నిర్ణయించింది. అయినప్పటికీ మీ రేషన్ కార్డు ఆరోగ్యశ్రీతో లింక్ అయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. లింక్ లేకపోతే మళ్లీ KYC అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చేయించుకోవాలి.


గృహజ్యోతి పథకం (ఉచిత విద్యుత్)

ఈ పథకం ద్వారా నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించబడుతుంది.
దరఖాస్తు విధానం ఇలా ఉంటుంది: ప్రజాపాలన ఫారం తీసుకుని అందులో వివరాలు నింపాలి.
ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కరెంట్ బిల్ జిరాక్స్‌లను జత చేసి మున్సిపల్ ఆఫీస్, ఎంపిడిఓ ఆఫీస్ లేదా ప్రజాపాలన సేవా కేంద్రంలో అప్లై చేయాలి.
అప్లికేషన్ చేసిన తర్వాత రిసిప్ట్ నెంబర్, మీటర్ నెంబర్ లైన్మెన్‌కు ఇవ్వాలి. అప్పుడు జీరో బిల్ అప్‌డేట్ అవుతుంది.


మహాలక్ష్మి పథకం – గ్యాస్ సబ్సిడీ

ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు గ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీ అందుతుంది.
దరఖాస్తు చేసుకోవాలంటే ప్రజాపాలన ఫారం‌తో పాటు గ్యాస్ బుక్ జిరాక్స్ జత చేసి సమీప ప్రభుత్వ కార్యాలయంలో అప్లై చేయాలి.
కొంతమందికి సబ్సిడీ రెగ్యులర్‌గా జమ అవుతుండగా, మరికొందరికి రాకపోవడానికి KYC, బ్యాంక్ లింకింగ్, ఆధార్ సమస్యలు కారణంగా ఉండవచ్చు.


ఇందిరమ్మ ఇళ్లు పథకం

పేదల కోసం ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన పథకం ఇది.
ఈ పథకానికి కూడా ప్రజాపాలన ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి.
మొదటి విడత పూర్తైన తర్వాత, రెండో విడతలో కొత్త రేషన్ కార్డు పొందిన వారిని కూడా సర్వే చేసే అవకాశం ఉంది. అందుకే అర్హులు అయితే ముందుగానే అప్లికేషన్ పెట్టుకోవడం మంచిది.


ఆసరా పెన్షన్ / చేయూత పథకాలు

వృద్ధులు, దివ్యాంగులు, విధవలు వంటి వర్గాలకు నెలవారీ పెన్షన్ అందించే పథకాలు ఇవి.
కొత్తగా రేషన్ కార్డు పొందిన వారు కూడా ప్రజాపాలన ద్వారా అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్ సమయంలో ఇచ్చిన మొబైల్ నెంబర్ యాక్టివ్‌లో ఉండాలి. వెరిఫికేషన్ సమయంలో అధికారులు కాల్ చేసే అవకాశం ఉంటుంది.


ముఖ్యమైన సూచనలు

కొత్త రేషన్ కార్డు పొందిన వారు వెంటనే అన్ని పథకాలకూ అప్లై చేయకముందు eKYC పూర్తి చేయాలి.
అప్లికేషన్ చేసిన తర్వాత రిసిప్ట్ నెంబర్‌ను భద్రంగా ఉంచుకోవాలి.
ప్రభుత్వం విడుదల చేసే తాజా మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు గమనించడం చాలా అవసరం.


New Ration Card Telangana