భారీ వర్షాల్లోనూ ప్రజలకు అండగా బెల్లంపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్

భారీ వర్షాల్లోనూ ప్రజలకు అండగా బెల్లంపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ దావా స్వాతి రమేష్ బాబు గారు...

బెల్లంపల్లి, : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో బెల్లంపల్లి శాసనసభ్యులు శ్రీ గడ్డం వినోద్ వెంకటస్వామి ఆదేశాల మేరకు బెల్లంపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి దావా స్వాతి రమేష్ బాబు, మున్సిపల్ కమిషనర్ శ్రీ తన్నీరు రమేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బందితో కలిసి పట్టణంలోని బజార్ ఏరియా, పలు బస్తీలు, లోతట్టు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి పరిస్థితులను సమీక్షించారు.

భారీ వర్షాల కారణంగా ఇళ్లు కూలిపోయిన బాధిత కుటుంబాలను స్వయంగా పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. వర్షాల వల్ల ఏర్పడిన ఇబ్బందులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

పట్టణంలోని ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలిచి ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్న ప్రాంతాల్లో మున్సిపల్ సిబ్బందితో నాళాలను వెంటనే తెరిపించి వరద నీరు ఎలాంటి ఆటంకం లేకుండా వెళ్లేలా చర్యలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో మూసుకుపోయిన డ్రైనేజీలను శుభ్రం చేయించి నీటి ప్రవాహాన్ని సాఫీగా కొనసాగేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

భారీ వర్షాలకు పలు బస్తీల్లో నేలకూలిన భారీ వృక్షాలను వెంటనే తొలగించి ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టారు. నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి, వరద నీటి మళ్లింపు పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. అలాగే డ్రైనేజీల పూడికతీత పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు.

వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మున్సిపల్ యంత్రాంగం 24 గంటలూ అప్రమత్తంగా పనిచేస్తోందని చైర్‌పర్సన్ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు వెంటనే మున్సిపల్ అధికారులు, సిబ్బందిని సంప్రదించాలని, సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ఆమె భరోసా ఇచ్చారు.

భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో బెల్లంపల్లి పట్టణ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని చైర్‌పర్సన్ దావా స్వాతి రమేష్ బాబు సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ రాగం శెట్టి సత్యనారాయణ,  పోలీస్ అధికారులు , ఆయా వార్డుల మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రతికూల వాతావరణాన్ని సైతం లెక్కచేయకుండా వర్షంలోనే క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కార చర్యలు చేపట్టిన చైర్‌పర్సన్ సేవాభావాన్ని పట్టణ ప్రజలు అభినందించారు.